ANDRAPRADESH,గుంటూరు: జిల్లా రైతు ఆళ్ల మోహన్‌రెడ్డి వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాగోలు-7034 అనే కొత్త వరి రకాన్ని సాగు చేసి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించారు. ఈ రకం తెగుళ్లను తట్టుకుని, నాణ్యతతో కూడిన పంటను అందిస్తుందని అధికారులు ప్రశంసించారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని రైతు, అధికారులు తెలిపారు.
వ్యవసాయం చేయడం అంత సులభం కాదు.. పంట సాగు నుంచి అమ్మకం వరకు రైతులు ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంటారు. పంటలకు సోకే తెగుళ్లు, వైరస్‌ల దెబ్బకు తక్కువ దిగుబడితో రైతులు నష్టపోతున్నారు.. ప్రకృతి వైపరిత్యాలను కూడా తట్టుకుని నిలబడటం అన్నదాతలకు కత్తిమీద సాములా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన రైతు మాత్రం అలా కాదు.. తన పొలంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. అధిక దిగుబడిని సాధిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
దుగ్గిరాల మండలం వీర్లపాలెం రైతు ఆళ్ల మోహన్‌రెడ్డి తన పొలాన్ని వ్యవసాయ పరిశోధనలకు ఒక ప్రయోగశాలగా మార్చారు. ఆయన 2017 నుండి ప్రతి సంవత్సరం కొత్త రకాల విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది లాంలోని రీసెర్చి విభాగం డైరెక్టర్ పాలడుగు సత్యనారాయణ ద్వారా రాగోలు-7034 అనే కొత్త రకం వరిని సాగు చేసి మంచి దిగుబడిని సాధించారు. ఆ పంట నాణ్యతను తెనాలి ఇంఛార్జ్ ఏడీఏ ఆర్.విజయ్‌బాబు ప్రశంసించారు.
ఈ రాగోలు-7034 రకం చాలా నాణ్యమైనదన్నారు. ఈ కొత్త రకం వల్ల ఎరువుల ఖర్చు తగ్గి, పెట్టుబడి ఆదా అవుతుందని, తెగుళ్లు, దోమకాటు వంటి సమస్యలు కూడా లేవన్నారు. సాధారణ బీపీటీ రకాల కంటే ఈ రకం ఐదు రోజులు ఎక్కువ కాలం పడుతుందని రైతు మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ఈ రాగోలు-7034 రకం సాగుకు ఎకరాకు ఖర్చు రూ.23000 కాగా.. 40 బస్తాలు దిగుబడి వచ్చింది. రైతు మోహన్ రెడ్డి గొర్రు, రొటోవేటరు వేసినందుకు రూ.3 వేలు ఖర్చు చేశారు.
విత్తనాలు ఎద పెట్టినందుకు రూ.1600, ఎకరానికి విత్తనాలు రూ.1500 ఖర్చు అయ్యింది. పొలంలో కలుపు తీయించడానికి కూలీలకు రూ.2వేలు, ఎకరా పంట నూర్పిడికి రూ.2600 నుంచి రూ.3వేల వరకు అయ్యింది. రైతు మోహన్‌రెడ్డికి మొత్తం మీద ఎకరాకు రూ.22,950 వరకు ఖర్చైంది. ఎకరాకు దిగుబడి 40 బస్తాల వరకూ అయ్యింది. రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వస్తుందని మోహన్‌రెడ్డి, అధికారులు అంటున్నారు.

Social Plugin