INDIA: ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీతో గతంలో ఉన్న ఘర్షణలపై చంద్రబాబు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ప్రధాని మోదీతో సంబంధాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు. ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీతో గతంలో ఉన్న ఘర్షణలపై చంద్రబాబు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయంలో సీఎం ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య విభేదాలు రావాలని కోరుకుంటున్న వారి రాజకీయ ప్రత్యర్థులకు ఇది సరైన సమాధానంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు వ్యాఖ్యలతో భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలు మళ్లీ ఎదురయ్యే అవకాశం రాదని అంటున్నారు.
2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు విభేదించిన విషయం తెలిసిందే. మళ్లీ 2024 ఎన్నికల ముందు ఈ ఇద్దరు జట్టుకట్టి రికార్డు విజయాన్ని సాధించారు. కేంద్రంలో ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అవతరించారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న 16 మంది ఎంపీల బలంపై కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆధారపడి వుంది. దీంతో మోదీపై ఒత్తిడి తెచ్చేలా చంద్రబాబు వ్యవహరిస్తారని జాతీయ స్థాయిలో అంతా ఊహించారు. కానీ, గత 18 నెలలుగా చంద్రబాబు తీరులో అలాంటి పద్ధతి కనిపించడం లేదు. ప్రధాని మోదీతో చాలా స్నేహపూర్వకంగా నడుచుకోడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్ మీడియా చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీతో గతంలో కొనసాగిన ఘర్షణలపై క్లిష్టమైన ప్రశ్నను ఎదుర్కొన్నారు చంద్రబాబు. అయితే రాజకీయాల్లో తలపండిన ముఖ్యమంత్రి ఆ ప్రశ్నకు చాలా సింపుల్ గా సమాధానం చెప్పి తన చాణఖ్యాన్ని ప్రదర్శించారు. ‘‘మా మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ కే కాదు.. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వం దేశానికే చాలా అవసరం’’ అంటూ చంద్రబాబు వెల్లడించారు. తమ మధ్య వ్యక్తిగతమైన వివాదాలు ఏవీ లేవని, తాను ఏ విషయమై ప్రశ్నించినా అది రాష్ట్రం కోసమేనంటూ చంద్రబాబు వివరణ ఇచ్చారు. తమ మధ్య సంబంధాలు ఇలానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో చాలా మందికి ఉన్న అనుమానాలు తొలగిపోయాయని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు తీవ్రంగా విభేదించారు. 2014లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచాయి. అయితే అప్పట్లో జాతీయ స్థాయిలో బీజేపీకి సొంతంగా బలం ఉండటంతో ఏపీకి నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం వహించిందని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతోపాటు రాజధాని అమరావతికి ప్రత్యేక నిధులు ఇవ్వలేదని చంద్రబాబు అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు.
దీంతో 2019లో టీడీపీ-బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఆ తర్వాత పరిణామాలతో 2024 ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు మళ్లీ కలిశాయి. ఇప్పుడు చంద్రబాబు పార్టీకి ఉన్న ఎంపీల బలమే కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారింది. అయినప్పటికీ ఆయన ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. దీనివల్ల 2024 ఎన్నికల తర్వాత కేంద్రం వైఖరి మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతితోపాటు పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని అంటున్నారు.

Social Plugin